అమెరికాలోని దావూద్ ఇబ్రహీం ఆస్తులకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ముంబయి పోలీసులు వివరాలు సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సమాచారాన్ని హోంశాఖకు అందివ్వడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారు అందించే రిపోర్టులో దావూద్‌కు సంబంధించిన వ్యాపార వివరాలతో పాటు తన అనుచరుల చిరునామాలు, అలాగే బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పొందుపరిచినట్లు వినికిడి. ఈ సమాచారంతో.. అమెరికా ప్రభుత్వ సహాయంతో దావూద్‌పై చర్యలు తీసుకొనేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధమయ్యే అవకాశం ఉంది.
హోంశాఖ తమ ఉన్న ఆధారాలతో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సహాయంతో తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటీష్ ప్రభుత్వం లండన్‌లో దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన ఆస్తులను జప్తు చేయడం జరిగింది. గతంలో భారత్, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు... టెర్రిరిజాన్ని అంతమొందించే క్రమంలో దేశాలు పరస్పరం సహాయం చేసుకొనేందుకు మొగ్గు చూపడం జరిగింది. ఆ ఒప్పందాన్ని అనుసరించి దావూద్ ఇబ్రహీం విషయంలో చర్య తీసుకొనే దిశగా భారత్ చేసే ప్రయత్నాలకు అమెరికా సహాయం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైఖేల్ పాంపియోతో పాటు అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ జేమ్స్ మాటిస్‌తో ఇదే అంశంపై జరిగిన చర్చల్లో పాలుపంచుకున్నారు. అల్ ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, జైషే ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్, ది హక్కానీ నెట్వర్క్, తెహ్రీక్ ఐ తాలిబన్ పాకిస్తాన్ వంటి నిషేధిత సంస్థలను కట్టడి చేసే విషయంలో ఇరు దేశాలూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని ఈ చర్చల్లో తీర్మానించడం జరిగింది.