Uk flight services: బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో రద్దైన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమైన కొత్త కరోనా వైరస్ ( New coronavirus ) ముప్పును దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 24 నుంచి యూకే-ఇండియాల మధ్య విమాన సర్వీసుల్ని ( Uk flight services ) భారతదేశం రద్దు చేసింది. అప్పటికే యూకే నుంచి తిరిగొచ్చినవారిలో 25 కు పైగా కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉందని నిర్ధారణ కావడంతో విమానాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) జనవరి 7 వరకూ పొడిగించింది.
జనవరి 8 నుంచి తిరిగి విమానాల రాకపోకల్ని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పరిమిత సంఖ్యలోనే విమానాలు నడిపేందుకు అనుమతిచ్చింది. సాధారణ పరిస్థితుల్లో ఇండియా యూకేల మధ్య వారానికి 60 విమానాలు నడిచేవి. ఇప్పుడు కరోనా వైరస్ ( Coronavirus ) సంక్రమణ దృష్టిలో ఉంచుకుని ఆ సంఖ్యను సగానికి తగ్గించేశారు. జనవరి 8 నుంచి వారానికి కేవలం 30 విమానాల్ని మాత్రమే నడపనున్నారు. మొన్నటివరకూ ఇండియాలోని పది నగరాల్నించి యూకేకు విమానాలు నడవగా..ఇప్పుడిక కేవలం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగుళురు నుంచే విమానాలు నడవనున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ( Union minister Hardeep singh puri ) ట్విట్టర్ వేదికగా ఈ విషయాల్ని వెల్లడించారు. ఎయిర్ ఇండియా, విస్తారా, బ్రిటీష్ ఎయిర్ వేస్, వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థలు మాత్రమే రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల్ని నడపనున్నాయి.
Also read: Vaccine Dry Run: దేశమంతటా ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రై రన్