భారత ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులను ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా వివిధ దేశాలకు తీసుకెళ్లినందుకు ఎయిర్ ఇండియా కేంద్రానికి బిల్లులు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటుంది. అయితే ఆ బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వడం లేదని.. ఇంకా భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా సంస్థకి రూ.325 కోట్లు బకాయి ఉందని సమాచారం.
ఇటీవలే సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి భారత ప్రభుత్వం, ఎయిర్ ఇండియాకి చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడగ్గా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరమే దాదాపు భారత ప్రభుత్వం రూ.241.80 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. అలాగే క్రితం సంవత్సరం చెల్లించాల్సిన బకాయిలు కూడా రూ.84.01 కోట్లు ఉండగా..మొత్తం కలిపి దాదాపు రూ.325 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
సాధారణంగా వీవీఐపీల కోసం సిద్ధం చేసే ఛార్టెడ్ విమానాల్లో ఎయిర్లైన్స్ సిబ్బంది అదనపు సౌకర్యాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాలకు సంబంధించిన బిల్లులలో కొన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ చెకర్ పద్ధతి ద్వారా చెల్లిస్తుంది. అలాగే కొన్ని బిల్లులను కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాని మంత్రి ఆఫీసుతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖలు కూడా చెల్లిస్తుంటాయి.
ఈ బిల్లులలో ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్రధానిమంత్రి ఆఫీసు ఇంకా రూ.128.84 కోట్లను ఎయిర్ ఇండియాకి చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవలే సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన అభ్యర్థన మేరకు సివిల్ ఏవియేషన్ శాఖ బహిర్గతం చేసింది. 2011 నుండి 2014 సంవత్సరాల మధ్యలో ఎయిర్ ఇండియా కైరో, ఇరాక్, మాల్టా లాంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినప్పుడు... ఆ ప్రాంతాల్లోని భారతీయులను ఇండియాకి తీసుకురావడం కోసం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపింది. ఆ బిల్లులలో కూడా దాదాపు రూ.11.594 కోట్ల రూపాయలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి.