తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై పలు కీలక విషయాలను వెల్లడించారు శశికళ. పోయెస్ గార్డెన్‌లో ఉన్న తన నివాసంలో2016 సెప్టెంబర్ 22న జయలలిత మొదటి అంతస్తులో ఉన్న వాష్‌రూమ్‌లో కిందపడిపోయారని, ఆస్పత్రికి వెళ్లేందుకు జయ నిరాకరించారని శశికళ చెప్పారు. అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో తీశానని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. కానీ.. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెను కలవలేదని పన్నీర్ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్ జడ్జికి వివరించారు. జయలలిత వాష్‌రూమ్‌లో కిందపడిపోయిన రోజున, ఆమె వద్దని వారించినా ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయ స్పృహలోకి వచ్చి..ఎక్కడికి తీసుకెళుతున్నారని ప్రశ్నించారని తెలిపారు. 'వాష్‌రూమ్‌లో కిందపడ్డ రోజున ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచగా.. నేను ఆస్పత్రికి వెళ్దామని చెప్పాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్‌కి ఫోన్ చేశాను’ అని శశికళ వివరించారు.