జయలలిత మృతి కేసు: విచారణ నిలిపేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు

జయలలిత మృతి కేసు: విచారణ నిలిపేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు

Updated: Apr 26, 2019, 02:40 PM IST
జయలలిత మృతి కేసు: విచారణ నిలిపేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుముగస్వామి కమిటీ జరుపుతోన్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కమిషన్‌ విచారణ జరుపుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చెన్నైలోని అపొలో ఆస్పత్రి వర్గాలు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను వేధింపులకు గురిచేస్తున్నారని అపొలో ఆస్పత్రి యాజమాన్యం సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది. అపోలో ఆస్పత్రి పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు ఈమేరకు విచారణపై స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో దీర్ఘకాలంపాటు చికిత్స పొందిన జయలలిత 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మృతి వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే 2017 సెప్టెంబర్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అరుముగస్వామి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.