స్మగ్లింగ్: అడ్డంగా దొరికిపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ హోస్టెస్

Last Updated : Jan 9, 2018, 02:49 PM IST
స్మగ్లింగ్: అడ్డంగా దొరికిపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ హోస్టెస్

అధిక పారితోషికం కలిగిన ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోని ఓ ఎయిర్ హెస్టెస్ అడ్డదారిలో అధిక సంపాదన కోసం స్మగ్లింగ్‌కి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇది. గురువారం రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి హాంగ్ కాంగ్ వెళ్లాల్సి వున్న ఓ విమానం ద్వారా అక్కడికి 10 లక్షల అమెరికా డాలర్లు ( భారతీయ కరెన్సీలో రూ. 3.2 కోట్లు) చేరవేసేందుకు సిద్దమవుతున్న ఓ ఎయిర్ హోస్టెస్‌ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. డీఆర్ఐ జరిపిన తనిఖీల్లో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఎయిర్ హోస్టెస్ వద్ద 10 లక్షలు వుండటం గుర్తించిన అధికారులు ఆమెని అదుపులోకి తీసుకుని ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసుకి సంబంధించి ఎయిర్ హోస్టెస్‌తోపాటు అమిత్ అనే మరో సప్లయర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై స్మగ్లింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

 

దర్యాప్తు సంస్థల నివేదిక ప్రకారమే తాము ఎయిర్ హోస్టెస్‌పై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రకటించింది. జీ న్యూస్‌తో మాట్లాడిన సంబంధిత అధికారులు... ఎయిర్ హోస్టెస్‌తో స్నేహం పెంచుకున్న అమిత్ ఆమెతో ఈ పని చేయించినట్టు తెలిపారు. అమిత్‌తో ఎయిర్ హోస్టెస్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ నల్ల ధనాన్ని అక్కడికి చేరవేసిన అనంతరం అక్కడి నుంచి స్మగ్లింగ్ రూపంలో బంగారాన్ని ఇండియాకు తీసుకురావాల్సి వుంది. అందుకు బదులుగా ఆమె తరలించిన నల్ల ధనం మొత్తంలో 1 శాతం వాటాను ముట్టచెప్పే విధంగా అమిత్ ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు.

 

గత రెండు నెలలుగా ఏడు సార్లు హాంగ్ కాంగ్ వెళ్లిన ఎయిర్ హోస్టెస్ మొత్తం 10 లక్షల అమెరికా డాలర్లు అక్కడికి తరలించినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. ఎయిర్ పోర్టులో స్కానింగ్ కి చిక్కకుండా ఫాయిల్ పేపర్ లో కరెన్సీ కట్టలని చుట్టి విదేశాలకి తరలించారామె. ఫాయిల్ పేపర్ ని స్కాన్ చేయడం స్కానర్ కి కాస్త కఠినతరం కావడంతో తనిఖీల్లోని ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని ఆమె ఈ స్మగ్లింగ్ కి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

Trending News