క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తను కేసు కూడా కథువా రేప్ కేసుతో సమానమేనని.. దీనిని కూడా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని ఆమె అధికారులకు విన్నవించుకుంటున్నట్లు తెలిపింది. హసీన్ జహాన్ ఇప్పటికే తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. అలాగే అతనికి అనేకమంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని కూడా తెలిపింది.
ఏప్రిల్ 23వ తేదిన కోల్కతాలో కథువా రేప్ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ డిమాండ్ చేయడానికి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జహాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కేసు కూడా కథువా కేసు లాంటిదేనని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ మాటలను ఆమె అన్నారు.
"ఏ కేసైనా నేరం చేసినవారికి శిక్ష పడాలన్నదే ధర్మం. నా కేసు కూడా కథువా కేసు లాంటిదే. ఇంకా చెప్పాలంటే నేను బతికే ఉన్నాను. బతికుండి కూడా నరకయాతన పడుతున్నాను." అని జహాన్ అన్నారు. "మీకో విషయం తెలుసా.. షమీ కుటుంబ సభ్యులు కూడా నన్ను రేప్ చేసి చంపాలని చూశారు. ఆ తర్వాత నా శరీరాన్ని తీసుకెళ్లి అడవిలో పూడ్చేయాలని ప్లాన్ చేశారు.
అందుకే వారికి శిక్ష పడడం కోసమే రెండు నెలలుగా నేను పోరాటం చేస్తున్నాను" అని జహాన్ ఆరోపించారు. ఇప్పటికే జహాన్ తనకు షమీ నుండి ప్రతి నెల రూ.10 లక్షలను భరణంగా ఇప్పించాలని కోరారు. ఇటీవలే ఇదే కేసుకు సంబంధించి జహాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు కూడా. అంతకు ముందు షమీపై జహాన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేశారు.