ముంబైలో వర్ష భీభత్సం.. దెబ్బతిన్న గోఖలే వంతెన

మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో కురిస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి.

Last Updated : Jul 3, 2018, 09:52 AM IST
ముంబైలో వర్ష భీభత్సం.. దెబ్బతిన్న గోఖలే వంతెన

మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో కురిస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అంధేరి వెస్ట్‌ ప్రాంతంలో  వర్షం ధాటికి గోఖలే వంతెన పాక్షికంగా దెబ్బతింది. అంధేరి తూర్పు, పశ్చిమాలను ఈ వంతెన కలుపుతుండగా.. ఇది దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగా మరమ్మత్తు పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేసిన అధికారులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరికీ గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శకలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. కాగా, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని యథాస్థితికి తెచ్చేందుకు రైల్వేశాఖ వెంటనే చర్యలు చేపట్టింది.

 

 

అంధేరి రైల్వే స్టేషన్- బాంద్రా రైల్వే స్టేషన్ మధ్య ఉన్న హార్బర్ రైల్వే లైన్ సర్వీసులన్నింటిని వంతెన కూలడంతో ఆపేశారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CSMT)- బాంద్రా రైల్వే స్టేషన్ మధ్య యధావిథిగా రైళ్లు నడుస్తున్నాయి. కాగా మహారాష్ట్ర వ్యాప్తంగా మరో 48 గంటల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Trending News