దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావో ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో ఈ దారుణాలను ఖండిస్తూ.. బాధితులకు ప్రభుత్వం సత్వర న్యాయం చేయాలని కోరుతూ అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా బెంగళూరు ప్రాంతంలో "My Street, My Protest" పేరిట ఓ వినూత్న క్యాంపెయిన్ ప్రారంభించారు.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా అనేకమంది నెటిజన్లు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు నిరసనలు వ్యక్తం చేయడానికి తమ ఇంటి పరిసర ప్రాంతాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్యాంపెయిన్‌ను దేశంలో వివిధ నగరాలకు కూడా విస్తరించాలని ఇతర నెటిజన్లను కోరుతున్నారు. ఫేస్బుక్ వేదికగా #MyStreetMyProtest పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో ఈ క్యాంపెయిన్ ఎలా చేయాలో కూడా తెలిపారు
ఈ క్యాంపెయిన్ వ్యక్తిగతంగా ఎవరైనా చేయవచ్చు. ఇది ఏ సంస్థకూ సంబంధించిన క్యాంపెయిన్ కాదు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ నిరసన కార్యక్రమం తాలూకు ప్రధాన లక్ష్యం
- ఈ క్యాంపెయిన్ చేయాలంటే మీ ఇంటి పరిసరాల్లోని ఏదైనా జన సామర్థ్యం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవలసి ఉంటుంది
- ఈ క్యాంపెయిన్‌ను ఎక్కడ చేస్తున్నారో.. ఆ లోకేషన్ ఫేస్బుక్‌లో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది
- ఈ క్యాంపెయిన్ గురించి మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు తెలిపి వారి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి తీసుకోవాల్సి ఉంటుంది
- వీలైతే ఈ క్యాంపెయిన్ గురించి ఓ పోస్టరు తయారుచేసి ప్రదర్శించండి
- సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ క్యాంపెయిన్ మీ ప్రాంతంలో చేయండి
- ఈ క్యాంపెయిన్ గురించి మీ ప్రాంతంలోని వ్యక్తులకు సాధ్యమైనంత వరకూ తెలియజేయండి
- తర్వాత ఈ క్యాంపెయిన్ ఫోటోలను #MyStreetMyProtest హ్యాష్ ట్యాగ్‌తో ఫేస్బుక్‌లో పోస్టు చేయండి
- మహిళలపై, బాలికలపై లైంగిక దాడులను ఖండిస్తూ.. ప్రభుత్వం సత్వరం బాధితులకు న్యాయం చేయాలని కోరడమే ఈ శాంతియుత కార్యక్రమ ప్రధాన లక్ష్యం