సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషికి రక్షణ కల్పించే బాధ్యత తమదేనని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజస్థాన్ లో ఈ నెల 25వ తేదీ నుంచి 'మై ఔర్ ఓ : కన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్' పేరిట ఐదు రోజులపాటు జరగనున్న సాహిత్యోత్సవాల్లో భాగంగా 28వ తేదీన జరిగే ఓ సదస్సుకి ప్రసూన్ జోషి హాజరు కావాల్సి వుంది. అయితే, ఈ నెల 25న విడుదల కానున్న వివాదాస్పద బాలీవుడ్ చిత్రం పద్మావత్ విడుదలని అడ్డుకుంటాం అని ప్రకటించిన ఆ రాష్ట్రానికి చెందిన కర్ణిసేన సామాజికవర్గం.. పద్మావత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషిపై సైతం గుర్రుగానే వుంది. ఈ నేపథ్యంలో ప్రసూన్ జోషి రాజస్థాన్ వస్తున్నాడని తెలుసుకున్న కర్ణిసేన.. అతడు రాజస్థాన్ రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తాడో చూస్తాం అంటూ ప్రసూన్ జోషికి వార్నింగ్ ఇచ్చింది.
ప్రసూన్ జోషి రాకను నిరసిస్తూ కర్ణిసేన జారీచేసిన హెచ్చరికలు, బెదిరింపులపై స్పందించిన రాజస్థాన్ సర్కారు.. ప్రసూన్ జోషికి రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రక్షణ కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా.. 'ప్రసూన్ జోషికి రక్షణ కల్పించడం అనేది తమ బాధ్యత' అని అన్నారు.