పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు మరోసారి భారీస్థాయిలో పెరిగిపోయాయి. ఢిల్లీలో తాజా సమాచారం అందేసరికి లీటర్ పెట్రోల్ ధర రూ.74.73 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర రూ.64.58 చిల్లరగా ఉంది. గత నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఎక్సైజ్ పన్నును తగ్గించాలని ఇప్పటికే డీలర్లు మొర పెట్టుకుంటున్నా.. అవి తగ్గకపోగా.. చమురుధరలు పెరగడంతో ఇప్పుడు ఆ పరిశ్రమలో అయోమయం నెలకొంది. సెప్టెంబరు 2014 తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే మొదటి సారి.
అప్పట్లో రూ.76.06గా పెట్రోల్ ధర నమోదైంది. ఆ తర్వాత తగ్గింది. మళ్లీ ఈ రోజు ఈ స్థాయిలో ధరలు భారీగా పెరగడానికి వివిధ కారణాలు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఒకప్పుడు నెలవారీ ధరకు సంబంధించిన సమీక్షలు ఉండేవని.. ఇప్పుడు రోజువారీ సమీక్షలు ఉంటున్నాయని.. అందుకే స్టాక్ మార్కెట్ ధరల ప్రభావం కూడా చమురు ధరలపై పడుతుందని పలువురు నిపుణులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం నెల్లూరు లాంటి ప్రాంతాల్లో లీటర్ రూ.80 రూపాయలు దాటడం గమనార్హం. అలాగే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో రూ.79 రూపాయలు దాటింది. తెలంగాణలో మాత్రం రూ.69 రూపాయలు దాటినట్లు సమాచారం. దక్షిణాసియాలోనే చమురుపై అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశంగా భారత్ ఇప్పటికే వార్తల్లో కెక్కింది. పోనిలే.. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ అయినా తగ్గిస్తున్నారా అంటే.. అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం కాబట్టి.. కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నా.. కొన్ని అనుసరించడం లేదు.