మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసిన రాహుల్ గాంధీ

కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఓ చేదు అనుభవం ఎదురైంది.

Last Updated : Apr 4, 2018, 07:01 PM IST
మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసిన రాహుల్ గాంధీ

కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో లింగాయత్ లని ఓ ప్రత్యేక మతంగా గుర్తించి ఆ బిల్లుని ఆమోదించిన కర్ణాటక ప్రభుత్వం ఆ తర్వాత అదే బిల్లుని కేంద్రం వద్దకు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీని ఓ మహిళ కాస్తంత గట్టిగానే నిలదీసింది. మీరు (కాంగ్రెస్ పార్టీ) లింగాయత్ లని కూడా ప్రత్యేక మతంగా గుర్తించి భారతీయులని మతం పేరిట విడదీసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడిగింది ఆ మహిళ. అయితే, మహిళ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని రాహుల్ గాంధీ ఒక్కసారిగా తెల్లమొహం వేశారు. ఆ అంశం గురించి తనకు అంత అవగాహన లేదు.. మీకు సీఎం సిద్ధరామయ్య గారు సమాధానం చెబుతారు అంటూ రాహుల్ గాంధీ తన పక్కనే వున్న సిద్ధరామయ్య వైపు తిరిగారు. దీంతో తన ప్రశ్నకు రాహుల్ గాంధీ నుంచి ఏదో ఓ స్పష్టమైన సమాధానం వస్తుందని ఆశించిన ఆ మహిళ సహా.. అక్కడున్న వాళ్లంతా ఆ సమాధానం విని నిర్ఘాంతపోయారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానం విని వెంటనే తేరుకున్న సిద్ధరామయ్య.. తాము కేవలం లింగాయత్ ల డిమాండ్ ని మాత్రమే కేంద్రానికి పంపించామని తెలిపారు. 

కర్ణాటకలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనియాంశమైంది. సంచలనం సృష్టించిన ఇంత పెద్ద వివాదంపై, అది కూడా తమ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయంపై అధినేతకే అవగాహన లేకపోతే ఎలా అని అక్కడున్న జనం చెవులు కొరుక్కోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

Trending News