రాంచి: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసింది. మే 12న లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హజరయ్యే నిమిత్తం లాలుకు పెరోల్ మంజూరైంది. బీహార్‌కు చెందిన మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను ప్రస్తుత మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు లాలూ హాజరుకాలేదు.
అయితే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈ సాయంత్రానికి పాట్నా బయల్దేరి వెళ్లనున్నారు. ఇటీవలే లాలూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతించింది. చికిత్స అనంతరం లాలూ ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయన్ని డిశ్చార్జి చేశారు. కానీ తాను పూర్తిగా కోలుకోలేదని లాలూ చెప్పగా.. ఆర్జేడీ కార్యకర్తలు ఎయిమ్స్‌లోని పరికరాలను ధ్వంసం చేసి ఆందోళనలు చేపట్టారు. లాలూ ఎయిమ్స్‌లో ఉండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పరామర్శించారు.
లాలూకు ఐదు రోజుల పెరోల్ మంజూరు