న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు జెట్ ఎయిర్వేస్ ఎయిర్ లైన్స్ సంస్థ షాక్ ఇచ్చింది. గత 25 ఏళ్లుగా విమానయాన సేవలు అందిస్తూ వివిధ భారతీయ బ్యాంకుల వద్ద భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ తిరిగి ఆ అప్పులను చెల్లించడంలో విఫలమవుతూ వస్తోంది. రుణాల చెల్లింపులో పలుమార్లు విఫలమైన జెట్ ఎయిర్వేస్కు భారతీయ బ్యాంకుల కన్సార్టియం గతేడాది డిసెంబర్ 31వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. అయితే, ఆ తేదీలోపు కూడా రుణాల చెల్లించడానికి ముందుకు రాకుండా ఎస్బీఐ సహా ఆయా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నష్టాల్లో వున్నట్టుగా చెబుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఆ సంస్థలో భారీ వాటా కలిగి వున్న ఇత్తేహాద్ ఎయిర్ లైన్స్ సంస్థ కృషిచేస్తోంది.
జెట్ ఎయిర్వేస్ రుణాల చెల్లింపు విషయంలో ప్రస్తుతం భారతీయ బ్యాంకుల కన్సార్టియంతో అబుదాబికి చెందిన ఇత్తేహాద్ ఎయిర్ లైన్స్ సంస్థ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సంస్థ పైలట్స్, వెండార్స్, సిబ్బందికి సైతం జీతాలు బకాయి పడి వున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ఆర్థిక పరిస్థితి ఆ కంపెనీ వాటాల ధరలపై సైతం ప్రభావితం చూపిస్తోంది. ఈ తరహా ఘటనలను పరిశీలిస్తున్న మార్కెట్ నిపుణులు.. గతంలో విజయ్ మాల్యా సైతం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం ఎస్బీఐ సహా ఇతర బ్యాంకుల నుంచి రూ.9000కు పైగా రుణాలు తీసుకొని, ఆ రుణాలను తిరిగి చెల్లించకుండానే దేశం విడిచిపారిపోయిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.