రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రను 'ఎంటర్‌ప్రెన్యుయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్'తో ఘనంగా సత్కరించింది బాంబే మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (బీఎంఏ). 60 ఏళ్లకు పైగా నేపథ్యం వున్న బాంబే మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌కు దేశంలోనే 6 దశాబ్ధాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. బుధవారం ముంబైలో జరిగిన 39వ బీఎంఏ అవార్డ్స్ ప్రదానోత్సవానికి వివిధ కారణాలతో సుభాష్ చంద్ర హాజరు కాలేకపోవడంతో ఆయన తరపున జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( జీఈఈఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునీత్ గోయెంక ఆ అవార్డుని స్వీకరించారు.
అయితే, ఈ అవార్డ్ షోకు సుభాష్ చంద్ర హాజరు కాలేకపోయినప్పటికీ, ఆయన మాట్లాడిన ఓ వీడియో సందేశాన్ని బీఎంఏ అవార్డ్స్ వేదికపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలకు తన అభినందనలు తెలిపారు. ఇదే వేదికపై లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న ఏ. ఎం. నాయక్‌కి కంగ్రాట్స్ చెప్పారు.
''తాను ఈ అవార్డ్ అందుకోవడానికి తొలుత సుముఖత వ్యక్తంచేయనప్పటికీ.. దేశంలో ప్రస్తుతం 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పంచే విధంగా పరిశ్రమలను నెలకొల్పిన మీరు ఈ అవార్డ్ స్వీకరించాల్సిందే'' అని జ్యూరీ సభ్యులు తనకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని సుభాష్ చంద్ర ఈ వీడియో ద్వారా పంచుకున్నారు. గడిచిన ఆరు దశాబ్ధాల్లో బీఎంఏ కేవలం ఐదుసార్లు మాత్రమే ఎంటర్ ప్రెన్యుయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డుని ప్రకటించగా అందులో ఈ అవార్డ్ అందుకున్న 5వ ఎంటర్ ప్రెన్యుయర్ సుభాష్ చంద్ర కావడం విశేషం.