ముంబయి: ముంబయి ఇల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేషనులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషను ఫుట్ బ్రిడ్జ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతిచెందారు. అలాగే 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి శ్రుతిమించుతున్న సందర్భంలో బాధితులను కేఈఎం ఆసుపత్రికి వెనువెంటనే తరలించడానికి అధికారయంత్రాంగం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని జీఆర్‌పీ కమీషనర్ నికేత్ కౌశిక్ తెలియజేశారు. ఈ ఘటనపై పశ్చిమ రైల్వే పీఆర్‌ఓ మాట్లాడుతూ దీనిని ఒక అనుకోని దుర్ఘటనగా పేర్కొన్నారు. భారీగా వర్షం పడుతున్న సందర్భంలో జనాలు ఒకే దగ్గర గుమిగూడి పోవడంతో పాటు, వెనువెంటనే రైలును అందుకోవడానికి చేసిన ప్రయత్నం వలనే ఈ తొక్కిసలాట జరిగిందని వివరించారు. ఆ స్టేషనులో త్వరలోనే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి న్యూ స్కై వాక్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సందర్భంలో తొక్కిసలాటను తప్పించుకోవడం కోసం కొందరు జనాలు బారికేడ్లను దాటడంతో పాటు రైలింగ్స్ పైకి కూడా ఎక్కారని పలువురు సాక్ష్యులు చెబుతున్నారు.
Three dead, more than 20 injured in a stampede at Elphinstone railway station's foot over bridge in Mumbai pic.twitter.com/EipEENFNaI
— ANI (@ANI) September 29, 2017
ఈ ఘటనకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతూ, అత్యవసర పర్యటనకు ఏర్పాటు చేయవలసిందిగా రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారని అధికారిక సమాచారం. ఈ పరిస్థితిని సమీక్షించి అత్యవసర సహాయం అందించేందుకు బీఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 10:30 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు కారణం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడం అని కూడా కొన్ని వదంతులు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది క్షణాల క్రితమే ఈ విషయంపై స్పంందిచారు. ముంబయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సమీక్షించవలసిందిగా అధికారులను ఆదేశించారు. భారత రాష్ట్రపతి కూడా ఈ విషయం మీద ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముంబయి మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. శివసేన ఎమ్మెల్యే అజయ్ చౌదరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికార పార్టీ హయంలో భారతీయ రైల్వే పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. బాధితులకు తక్షణం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ రైల్వే ప్రమాదానికి సంబంధించి అత్యవసర పరిస్థితిపై బాధిత కుటుంబాల సౌకర్యార్థం ఈ క్రింది ఫోన్ నెంబర్లో సంప్రదించవలసినదిగా రైల్వే అధికార యంత్రాంగం పేర్కొంది
కేఈఎం ఆసుపత్రి: 022-24107000
పశ్చిమ రైల్వే కంట్రోల్ రూమ్ : 022 - 23070564, 022-23017379, 022-23635959
ముంబయి రైల్వే కంట్రోల్ రూమ్: 022-23081725
ట్రాఫిక్ హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబరు: 8454999999