ఓ ముస్లిం యోగా నేర్పించడం తప్పా..?

  

Last Updated : Nov 8, 2017, 03:15 PM IST
ఓ ముస్లిం యోగా నేర్పించడం తప్పా..?

రఫియా నాజ్ అనే ముస్లిం యువతి జార్ఖండ్‌లో యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. యోగాలో నిష్ణాతురాలైన ఈమె బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఓ కార్యక్రమంలో కూడా యోగా చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఒక ముస్లిం యువతి, యోగా నేర్పించడం మతధర్మానికి విరుద్ధమని.. ఆమె గనుక యోగా శిక్షణ ఇవ్వడం కొనసాగిస్తే, తనను హతమారుస్తామని ఇటీవలే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు సందేశాలు పంపించడం మొదలుపెట్టారు. అలాగే ఆమె యోగా నేర్పిస్తే.. ముస్లింగా పరిగణించలేమని ఓ ముస్లిం కమ్యూనిటీ కూడా ఫత్వా జారీ చేసింది. ఈ క్రమంలో ఆమెకు జార్ఖండ్ ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రతను కల్పించడానికి శ్రీకారం చుట్టింది. రాంచీ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీస్, నాజ్‌కు భద్రత ఇవ్వడానికి ఒక పోలీస్ టీమ్‌ను సైతం నియమించారు. ఇటీవలి కాలంలో నాజ్‌తో పాటు, ఆమె కుటుంబానికి కూడా బెదిరింపులు రావడం గమనార్హం.

రాంచీలోని డొరండా ప్రాంతంలోని ఓ కళాశాలలో ఎంకాం చదువుతున్న రఫియా నాజ్ చిన్నప్పటి నుండీ ఎంతో ఆసక్తితో యోగా నేర్చుకున్నారు. ఆ తర్వాత యోగా టీచర్‌గా మారి ఎందరో విద్యార్థులకు యోగా నేర్పిస్తూ, వారిచ్చే డబ్బులతో తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ "నాకు ఇరు మతాలపై కూడా పలు అభ్యంతరాలు ఉన్నాయి. ఒక మతం నన్ను యోగా నేర్పించవద్దని డిమాండ్ చేస్తుంటే.. మరో మతం నేను నేర్పించే యోగా మరింతమందికి చేరువ కావాలంటే పేరు మార్చుకోవాలని సూచిస్తోంది. కానీ.. నేను నేనుగానే ఉంటూ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యోగా చేస్తాను.. యోగా శిక్షణ కూడా అందిస్తాను" అని నాజ్ పేర్కొ్న్నారు. 

Trending News