లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బీజేపీతో పాటు ఆరెస్సెస్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి రబ్రీదేవిని కించపరుస్తూ పలు పోస్టులు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు కావడంతో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ కావడానికి కారణమైన బీజేపీకి 2019లో ప్రజలు కచ్చితంగా గుణపాఠం నేర్పుతారని ఆయన తెలిపారు.
"మా కుటుంబంలో మనస్పర్థలు తీసుకురావడానికే నా ఖాతా హ్యాక్ చేసి.. అందులో నా తల్లిని కించపరిచే విధంగా పోస్టులు చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ, ఆరెస్సెస్ ముఠాల పనే. మా యాదవ్ కుటుంబంలో ఎవరు ఎలాంటి చిచ్చు పెట్టాడానికి ప్రయత్నించినా.. మాలో ఎటువంటి మనస్పర్థలు రావు. మేము ఐకమత్యంగానే ఉంటాం" అని తేజ్ ప్రతాప్ మీడియాకి తెలిపారు. "మాకు అంకుల్ లాంటి నితీష్ కుమార్ కూడా ఈ రోజు బీజేపీతో చేతులు కలిపి మా కుటుంబంలో స్పర్థలు తీసుకురావడానికి ప్రయత్నించారు" అని కూడా తేజ్ ప్రతాప్ పోస్టు చేశారు.
ఇంతకీ ఆరోపణలు ఎదుర్కొన్న పోస్టులో చెప్పిన విషయమేమిటంటే.. తేజ్ ప్రతాప్ తన నియోజకవర్గంలో తన మాటలకు వ్యతిరేకంగా తన తల్లి రబ్రీదేవి నడుస్తున్నారని.. కొడుకు ఆలోచనలకు ఆమె ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదని..అందుకే ఆయనే రాజకీయాల నుండి తప్పుకోబోతున్నారని ఎవరో రాశారట. ఇటీవలే పెళ్లి చేసుకున్న తేజ్ ప్రతాప్, తన భార్య మాటలకు అనుగుణంగానే నడుస్తున్నాడని.. అందుకే తల్లిని లక్ష్యపెట్టడం లేదని.. అందుకే ఆమె కోపంగా ఉన్నారని కూడా ఎవరో ఆ పోస్టులో తెలిపారు.