లాడెన్ ఉన్నట్టు పాక్‌కు తెలీదు

దేశాన్ని మతపరంగా విడగొట్టవద్దని.. ముస్లింలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతగానో ఉందని 2015లో తాను భారత్‌లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా చెప్పానని ఒబామా అన్నారు.

Last Updated : Dec 2, 2017, 12:57 PM IST
    • భారత్‌లో ముస్లింలను మరింత ప్రోత్సహించాలి
    • దేశాన్ని మతపరంగా విభజించవద్దు
    • లాడెన్ ఉన్నట్టు పాక్ కు తెలీదు
    • పప్పు, కీమా ఇష్టం అంటే ఇష్టం
    • టౌన్ హాల్ సమావేశంలో బరాక్ ఒబామా
లాడెన్ ఉన్నట్టు పాక్‌కు తెలీదు

'భారత్-అమెరికాది 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యం' అని చెప్పారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. శుక్రవారం భారత్ సందర్శనకు వచ్చిన ఆయన న్యూఢిల్లీలో గడిపారు. ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ లో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఒబామా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భావితర నాయకులకు శిక్షణ ఇవ్వడమే ఏకైక లక్ష్యంగా తన శేషజీవితాన్ని గడుపుతున్నారన్న సంగతి తెలిసిందే..!

ఒక ప్రముఖ పత్రిక పాత్రికేయుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు బరాక్ ఒబామా బదులిస్తూ.. ప్రధాని మోదీ వైఖరి, మన్మోహన్ సింగ్‌తో స్నేహం, సీమాంతర ఉగ్రవాదం, పాకిస్తాన్‌తో చర్చలు తదితర అంశాలపై మాట్లాడారు.  దేశాన్ని మతపరంగా విడగొట్టవద్దని.. ముస్లింలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతగానో ఉందని 2015లో తాను భారత్‌లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా చెప్పానని ఒబామా అన్నారు. అయితే మీ అభిప్రాయానికి మోదీ ఎలా స్పందించారు అని ప్రశ్న అడగ్గా.. ఒబామా సమాధానం దాటవేశారు. ఈ దేశంలో ఉన్న ముస్లింలు తమని తాము భారతీయులుగానే భావిస్తారని చెప్పారు.

మోదీ, మన్మోహన్ గురించి.. 

ప్రధాని మోదీ అంటే నాకెంతో ఇష్టం. దేశాభివృద్డికి సంబంధించి ఆయనకు ఒక విజన్ ఉంది. నాకు మన్మోహన్ సింగ్ లాంటి చాలా మంది స్నేహితులు ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించిన ఘనత మాత్రం మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఒబామా కితాబిచ్చారు. 

లాడెన్ విషయంలో పాకిస్థాన్ 

ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో తలదాచుకున్నాడన్న సంగతి పాక్ ప్రభుత్వానికి తెలిసినట్లు ఆధారాలేవీ దొరకలేదని ఒబామా ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు, కొంతమంది పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులకు సంబంధం ఉండి ఉండవచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు.

పప్పు, కీమా 

సరదాగా భారతీయ వంటకాల గురించి కూడా ఒబామా మాట్లాడారు. తనకు పప్పు అంటే ఇష్టమని ఒబామా చెప్పారు. పప్పు అయితే వండటం కూడా తెలుసని చెప్పారు. అమెరికా అధ్యక్షుల జాబితాలో పప్పు తినేది తానొక్కడినేని.. కీమా కూడా రుచిగా వండుతానని.. అయితే చపాతీ చేయడం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. 

ట్రంప్ పేరు పరోక్షంగా.. 

ఒబామా తన ప్రసంగాల్లో ఎక్కడా ట్రంప్ పేరు ప్రస్తావించలేదు. సోషల్ మీడియా వాడకంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వచ్చిన ఆలోచనలు వెంటనే ట్విట్టర్‌లో రాసి పోస్టు పెట్టడం కన్నా.. జాగ్రత్తగా రాస్తే మంచిదని హితవు పలికారు. 

మోదీతో భేటీ

జనవరిలో అమెరికా అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నాక ఒబామా మోదీని కలవడం ఇదే తొలిసారి. 'ఒబామాను కలవడం నాకు సంతోషంగా ఉంది. ఒబామా ఫౌండేషన్ కార్యకలాపాలు గురించి, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నా' నని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x