న్యూడిల్లీ: 2020-21 విద్యాసంవత్సరం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించే అవకాశాలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పరిశీలన జరుపుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం ఎప్పటినుంచి ప్రారంభించాలి, విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే అంశంపై పరిశీలన జరిపేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు శుక్రవారం తమతమ నివేదికలను అందించాయి.
హర్యానా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.సీ.కుహాడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆన్ లైన్ విద్యా విధానం, మార్పులు- చేర్పులు, తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై అధ్యయనం చేసింది. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను అనుసరించి, పూర్తిస్థాయి పరిశీలన జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.
యూజీసీ ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విద్యా సంవత్సరం మాత్రం జూన్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం లేదని పేర్కొంది.