SC Safeguards: ఎస్సీ వర్గీకరణలో కీలక ముందడుగు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ

SC Communities Safeguards: షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ విషయంలో కీలక ముందడుగు పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని నియమించింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 22వ తేదీన తొలి సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 05:32 PM IST
SC Safeguards: ఎస్సీ వర్గీకరణలో కీలక ముందడుగు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ

Safeguard Interests of SC Communities: ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కమిటీని ఏర్పాటుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐదుగురు ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన దళిత దండోర సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 22న కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది. కాగా కమిటీకి కాల పరిమితి అనేది ప్రకటించలేదు. కాకపోతే వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పందించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 'ఎస్సీ ఉప కులాల విశ్వరూప మహాసభ'లో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తారు. వర్గీకరణపై కమిటీ వేస్తానని నాడు ప్రధాని ఇచ్చిన హామీలో భాగంగా నేడు కమిటీ ఏర్పాటైంది. ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. కొత్తగా ఏర్పాటుచేసిన రాజీవ్‌ గౌబా కమిటీ సమావేశమై త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 

ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ ఈనాటిది కాదు. దశాబ్దాల కాలంగా వర్గీకరణ ఉద్యమం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ కోసమే పోరాటం చేస్తోంది. ఆ సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ సమావేశంలో మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలోనే మోదీ 'వర్గీకరణపై కమిటీ' అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఎస్సీ వర్గాల్లో హర్షం
కాగా, కేంద్రం కమిటీ ఏర్పాటుచేయడంపై ఎస్సీ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం కమిటీని ఏర్పాటుచేసినట్లు ఎమ్మార్పీఎస్‌ వర్గాలు తెలిపాయి. కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని.. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటిందని వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న నాయకులు చెబుతున్నారు. వర్గీకరణతో మాదిగల బతుకు బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News