భీమా కోరేగావ్ హింస కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ పరమ్ వీర్ సింగ్. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణల కింద విరసం నేత వరవరరావు, హక్కుల ఉద్యమకారులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖా, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేత సుధా భరద్వాజ్‌లను పూణె పోలీసులు మంగళవారం వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారిని సెప్టెంబర్ 6 వరకు గృహ నిర్భందంలో ఉంచాల్సిందిగా సుప్రీం కోర్టు అనంతరం ఇచ్చిన ఆదేశాల మేరకు పూణె పోలీసులు సదరు మానవ హక్కుల కార్యకర్తలను వారి వారి ఇళ్ల వద్దకు తీసుకొచ్చి గృహనిర్భందంలో ఉంచారు. ఏ ఆధారాలు లేకుండానే మానవ హక్కుల సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారని మహారాష్ట్ర పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ పరమ్ వీర్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
WATCH: Maharashtra Police briefing on Bhima Koregaon violence case https://t.co/kavuKpwQFF
— ANI (@ANI) August 31, 2018
ఆ ఐదుగురు వ్యక్తులు మావోయిస్టులకు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయంటూ పలు లేఖల్లోని అంశాలను మహారాష్ట్ర ఏడీజీ పరమ్ వీర్ సింగ్ మీడియా ఎదుట చదివి వినిపించారు. లేఖల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే చదివి వినిపిస్తున్నానని, చదవని అంశాలు లేఖల్లో ఎన్నో ఉన్నాయని ఏడీజీ అన్నారు. ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అని ఈ సందర్భంగా ఏడీజీ పరమ్ వీర్ సింగ్ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ హింస కేసు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని యావత్ దేశం ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా
పరిశీలిస్తోంది.