కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పేరు మార్చాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌కి ''బంగ్లా'' అని పేరు మార్చాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. ఈమేరకు ప్రధానికి ఓ లేఖ రాసిన మమతా బెనర్జి.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే పేరును సవరణ చేస్తూ బిల్లు పాస్ చేయాల్సిందిగా విన్నవించుకున్నారు.
ఇదిలావుంటే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి, మమతా బెనర్జికి మధ్య ఎంత పెద్ద యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోదీ ఓటమికి తన వంతు కృషి చేస్తానంటూ మమతా బెనర్జీ బహిరంగంగానే ప్రకటించడమే కాకుండా మోదీ వ్యతిరేక శక్తులతో చేయి కలిపి ప్రచారం సైతం నిర్వహించారామె. అంతేకాకుండా ఎన్నికల సందర్భంలోనూ పశ్చిమ బెంగాల్ ఓ రణరంగాన్నే తలపించింది. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా హింస, అల్లర్లు పశ్చిమ బెంగాల్లోనే చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో బీజేపి, అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాయి. అయినప్పటికీ మోదీ ఘన విజయం సాధించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దీదీ చేసిన ఈ విజ్ఞప్తిని మోదీ సర్కార్ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో వేచిచూడాల్సిందే మరి.
పశ్చిమ బెంగాల్ పేరు మార్చండి: ప్రధానికి మమత బెనర్జి లేఖ