Zakir Husain: రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి.. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర ఇదే..!

Zakir Husain Death Anniversary: మొదటి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1897 ఫిబ్రవరి 7న జన్మించగా.. 1969 మే 3న మరణించారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస వెళ్లింది. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర గురించి ఇక్కడ తెలుసుకోండి.     

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2024, 04:23 PM IST
Zakir Husain: రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి.. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర ఇదే..!

Zakir Husain Death Anniversary: భారతదేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి, పదవిలో మరణించిన మొదటి భారత దేశ ప్రథమ పౌరులు జాకీర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969). ఆయన మే 13 1967 నుంచి మరణించినంత వరకు రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. భారత 3వ రాష్ట్రపతి జాకీర్ హుసేన్ హైదరాబాదు (భారతదేశం)లో జన్మించారు. ఆయన తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవారు. ఆయన  హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్‌కు వలస వెళ్లారు. హుస్సేన్  ప్రారంభ ప్రాథమిక విద్య హైదరాబాద్‌లో పూర్తయింది. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్)లోని 'ఇస్లామియా ఉన్నత పాఠశాల'లో చదువుకున్నారు. లక్నో విశ్వ విద్యాలయం క్రిస్టియన్ డిగ్రీ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టభద్రడయ్యారు. ఉన్నతవిద్య అలీఘర్‌లోని ఆంగ్లో మహ్మదన్ ఓరియంటల్ కాలేజీలో అభ్యసించారు. ఇక్కడ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపుపొందారు. 18 ఏళ్ల వయస్సులో ఆయన షాజహాన్ బేగంను వివాహం చేసుకున్నారు.

జాకీర్ హుస్సేన్ 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందంతో అయన నేషనల్ ముస్లిం విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. మొదట అలీఘర్‌లో 1920 అక్టోబర్ 29న స్థాపించారు. ఆ తరువాత 1925లో న్యూ ఢిల్లీలోని కరోల్ బాగ్‌కు మార్చారు. మార్చి 1, 1935న న్యూ ఢిల్లీలోని జామియా నగర్‌కు మళ్లీ మార్చారు. దీనికి జామియా మిలియా ఇస్లామియా (కేంద్ర విశ్వ విద్యాలయం) అని పేరు పెట్టారు.  

జాకీర్ విత్తశాస్త్రంలో PHd చేసేందుకు 'బెర్లిన్ విశ్వ విద్యాలయానికి (జర్మనీ) వెళ్ళారు. 1926లో బెర్లిన్ విశ్వ విద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాథ, కవితా సంగ్రహాలను క్రోడీకరించారు. 1927లో మూసివేతను ఎదుర్కొంటున్న జామియా మిలియా ఇస్లామియాకు నాయకత్వం వహించడానికి అతను భారత దేశానికి తిరిగి వచ్చారు. జామియా మిల్లియా ఇస్లామియాకు 21 సంవత్సరాలు ఆయన  పదవిలో కొనసాగారు. ముహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల (ఇప్పుడు అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం) వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారు. మహమ్మద్ అలీ జిన్నా వంటి రాజకీయ ప్రత్యర్థుల ప్రశంసలను పొందారు.

బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులు కలిపి "బేసిక్ విద్య"పై కఠోర పరిశ్రమ చేశారు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించారు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యా విభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందారు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశ భక్తులు.

భారత స్వాతంత్ర్యం తరువాత అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవిని  అంగీకరించారు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్‌లో అదుపులో ఉంచేందుకు ఆయన నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956లో పార్లమెంటు సభ్యుడిగా నామినేట్ అయ్యారు. 1957లో బీహారు గవర్నర్‌గా నియమించడంతో పార్లమెంటుకు రాజీనామా చేశారు. బీహార్ గవర్నరుగా 1957 నుంచి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుంచి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అనంతరం మే 13 1967న భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారత దేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవీ కాలంలో, హుస్సేన్ హంగరీ, యుగోస్లేవియా, యుఎస్ఎస్ఆర్, నేపాల్‌లకు నాలుగు దేశాలలో పర్యటించారు. 1969 మే 3న ఆయన మరణించగా.. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో ఖననం చేశారు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.

  రామ కిష్టయ్య సంగన భట్ల 
      9440595494

Trending News