ఫ్రిజ్ తుడువాలంటే చాలా మంది అదేదో పెద్దపని అన్నట్లు పక్కన పెడుతుంటారు. పండుగలకు, శుభకార్యాలకు తుడుద్దామనుకున్నా అస్సలు పట్టించుకోరు. తుడవకుండా అలానే ఉంచితే పురుగులు పట్టి మొదటికే మోసం వస్తుంది. అలా కాకుండా కొన్ని సులభ మార్గాల ద్వారా ఫ్రిజ్ ను శుభ్రం చేసుకొనే చిట్కాలు ఉన్నాయి.
* ఫ్రిజ్ శుభ్రం చేయాలంటే ముందుగా ఫ్రిజ్ ఆఫ్ చేసి, అందులోంచి వస్తువులు తీసేయాలి. పాడయిపోయిన ఆహారాలను విసిరేయండి.
* ఫ్రిజ్ లోపల, బయట వెనిగర్, నిమ్మరసం కలిపిన నీటితో తుడవాలి. ప్రతి అరను విడివిడిగా కడగాలి. కూరగాయలు ఉంచే ట్రే ను శుభ్రంగా ఎప్పటికప్పుడు కడగాలి. అలా చేయపోతే కూరగాయలు పాడైపోతాయి.
* ఫ్రిజ్ అంతా శుభ్రంగా కడిగాక ఆహారపదార్థాలను క్రమ పద్దతిలో ఉంచాలి. అందులో పెట్టె డబ్బాలు, బాక్స్ లు శుభ్రంగా తుడవాలి.
* ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను ఇరికించి పెట్టవద్దు. ఫ్రిజ్ లో గాలి పోయేలా ఖాళీ స్థలం ఉంచాలి.
* సువాసన వస్తువులు, పూలు ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకి పోకుండా ఉండేందుకు కవర్ లో పెట్టి ఉంచాలి.
* ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు ఆకుకూరలైతే వేళ్ళను కత్తిరించి, కాయగూరలైతే తడిలేకుండా చూసుకోవాలి.
* దోసెల పిండి, పూర్ణం, ఇడ్లీ పిండి, పాలు, పెరుగు లాంటివి ఉంచితే వాటిపై మూత పెట్టి ఉంచాలి.
* ఫ్రిజ్ లో ఎక్కువగా ఐస్ గడ్డలు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఉంటే ఆఫ్ చేసి ఐస్ గడ్డలను తొలగించాలి.
* మటన్, చికెన్ వంటివి డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి. గుడ్లు ఎగ్ -ట్రే లో ఉంచాలి.
* చేపలు ఫ్రిజ్ లో ఉంచితే తప్పక దానిపై మూత పెట్టండి. లేకపోతే ఫ్రిజ్ అంతటా చేపల వాసన వస్తుంది.