Valentines Day 2023: వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది.. లవ్లీ కపుల్స్ కోసం లవ్లీ టూరిస్ట్ స్పాట్స్

Valentines Day 2023: వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తమ జీవిత భాగస్వామిని, తమ లవర్‌ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందమైన, ఆహ్లాదకరమైన చోటుకు తీసుకు వెళ్లి వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఆశ ఎంతోమందికి ఉంటుంది. అయితే, రెగ్యులర్‌గా అందరికీ తెలిసిన ప్రదేశాలు కాకుండా కొత్తగా ఏదైనా టూరిస్ట్ స్పాట్ ఉందా అని అన్వేషించే వారి కోసమే ఈ వివరాలు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 08:26 PM IST
Valentines Day 2023: వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది.. లవ్లీ కపుల్స్ కోసం లవ్లీ టూరిస్ట్ స్పాట్స్

Valentines Day 2023: మనసుకు నచ్చిన వారికి అవధుల్లేని సంతోషం పంచడం కోసం వీలైతే వారిని విదేశాలకు తీసుకు వెళ్లాలనే కోరిక కూడా ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడే పని కాదు కాబట్టి ఇండియాలోనే అలాంటి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడూ తెలుసుకుందాం రండి.

గోవా..
గోవా అంటే చాలా మంది ఫ్రెండ్స్ తో వెళ్లి పార్టీలు చేసుకోవడానికే సరైన చోటుగా భావిస్తుంటారు. కానీ మీ మనసుకు ఇష్టమైన లవ్లీ పార్టనర్ తోనూ ఆనందంగా, సరదాగా గడపడానికి గోవాలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. బటర్ ఫ్లై బీచ్, సింక్వెరిం బీచ్, అగోండా బీచ్, బెనాలిం బీచ్ తో పాటు ఇంకెన్నో బీచ్ లు వాలెంటైన్స్ డే కోసం సిద్ధమవుతున్నాయి. ఇవేకాకుండా దూద్ సాగర్ లాంటి మనసు దోచుకునే ఎన్నో ప్రదేశాలు గోవాలో పుష్కలంగా ఉన్నాయి. 

మేఘాలయలోని దావ్‌కి..
మేఘాలయ రాష్ట్రం మొత్తం ఎన్నో అందమైన ప్రదేశాలకు నిలయం. కానీ చిరపుంజి నుంచి 85 కిమీ దూరంలో ఉన్న దావ్‌కి మాత్రం పర్యాటకులకు, ప్రేమ జంటలకు ఇంకా ప్రత్యేకం. ముఖ్యంగా ఇక్కడి సరస్సులో బోటింగ్ చేయడం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే రొమాంటిక్ ఎక్స్‌పీరియెన్స్.   

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్..
రాజసం ఉట్టిపడే ప్యాలెస్‌లు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అందమైన సరస్సులు, పర్యాటకులను కట్టిపడేసే లగ్జరీ హోటల్స్.. వాతావరణానికి అనుగుణంగా తమ గుణం మార్చుకునే ఎడారులు.. ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉదయ్‌పూర్ వచ్చే ప్రేమపక్షులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

కేరళలోని అలెప్పీలో తేలియాడే బోట్ హౌజులు
కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్‌లో నీటిపై తేలియాడే బోట్ హౌజెస్‌లో విహరిస్తూ అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేయడం అనేది మాటలకు అందని ఒక మధురానుభూతి. బోట్ హౌజెస్ ఎన్నో చూసి ఉండొచ్చు కానీ అలెప్పీలోని బ్యాక్ వాటర్ పై బోటు హౌజులో విహరించడం మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం అంటుంటారు అక్కడికి వెళ్లి వచ్చిన పర్యాటకులు. అలెప్పీకి అలప్పుర అనే మరో పేరు కూడా ఉంది. కేరళలో ఇలాంటి పర్యాటక ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. 

చరిత్రను చెప్పే హంపిలోని అందమైన శిల్పా కళా సంపద
కర్ణాటకలోని హంపి గురించి చెప్పుకోవాలంటే అక్కడి శిల్పా కళ సంపద గురించే ముందుగా చెప్పుకోవాలి. వెంకటేష్, విజయశాంతి కలిసి జంటగా నటించిన సూర్య ఐపిఎస్ సినిమాలో హీరోయిన్ అందం గురించి పొగిడే క్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి..  ఆమె అందాన్ని హంపిలోని అందమైన శిల్పాలతోనే పోల్చడం మీరు కూడా వినే ఉంటారు.

" హంపిలోని శిల్పాలకు, ఎల్లోరాలోని నాట్యాలకు నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి అంటూ సాగిన ఆ పాటలోని కొన్ని లైన్స్ వింటేనే హంపిలోని శిల్పా కళా సంపద ఎంత ఆకట్టుకుంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. చరిత్రను ఇష్టపడే వారికి కూడా హంపి ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మరో కథనంలో తెలుసుకుందాం.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x