Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

Kothakota Dayakar Reddy Passed Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. మూడుసార్లు టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 13, 2023, 07:30 AM IST
Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

Kothakota Dayakar Reddy Passed Away: మాజీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్‌రెడ్డి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తకోట.. మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండుసార్లు అమరచింత నుంచి గెలుపొందగా.. ఒకసారి మక్తల్‌ నుంచి విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురంలో జన్మించిన దయాకర్‌రెడ్డి పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 

1958లో ఆగష్టు 18న జన్మించిన కొత్తకోట దయాకర్ రెడ్డి.. బీఎస్సీ వరకు చదువుకున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి చేతిలో 6751 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 1994 ఎన్నికల్లో అదే ప్రత్యర్థిపై 44,963 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999లో 22307 ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో సల్గుటి స్వర్ణ సుధాకర్ చేతిలో ఓడిపోయారు. 

2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మక్తల్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఎన్నికల్లో ఆయన భార్య సీతమ్మ దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె 2002లో జెడ్పీ చైర్‌పర్సన్‌గానూ పనిచేశారు.  2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌లో టీడీపీకి కీలక నేతగా కొత్తకోట దయాకర్ రెడ్డి పనిచేశారు. దాదాపు 30 ఏళ్లుగా టీడీపీతో ఆయనకు అనుబంధం ఉంది. 

గతేడాదికి టీడీపీకి రాజీనామా చేసిన కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు.. ఆ తరువాత ఏ పార్టీలోనూ చేరలేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అవ్వడంతో కాంగ్రెస్‌లోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే పార్టీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండగా.. గత నెల రోజులుగా దయాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?a

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News