Health Benefits of Drinking 2 Litres of Water Daily: ప్రతీ రోజూ 2 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నీరు అధికంగా తాగడం వల్ల తరచుగా మూత్రం రావడం జరుగుతుంది. అలా తరచుగా మూత్రం రావడం వల్ల ఒంట్లోని మలినాలు, ఇన్ఫెక్షన్కి కారణమయ్యే చెడు బ్యాక్టీరియా వంటివి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్ని దూరం పెట్టవచ్చు. అంతేకాదు.. తరచుగా మూత్రం వెళ్లే వారిలో కిడ్నీలో రాళ్లు తయారయ్యే ప్రమాదం కూడా చాలా తక్కువే అనే పలు అధ్యయనాల్లో తేలింది. కిడ్నీలో రాళ్లు మాత్రమే కాదు.. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ సైతం దరిచేరవు. మలబద్ధకాన్ని సైతం ఈ అలవాటు నివారిస్తుంది.
రోజూ 2 లీటర్ల నీరు తాగడం వల్ల మీ గుండె, మెదడు, కిడ్నీలతో పాటు ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేస్తాయి. అందుకు కారణం నీటితో పాటే అన్ని శరీర భాగాలకు ఆక్సీజన్ సరఫరా అవుతుంది కనుక.
రోజూ రెండు లీటర్ల నీరు తాగడం వల్ల రోజంతా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రోజంతా శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ఎలాంటి అలసట లేకుండా పనిచేసేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. మూత్రపిండాల పని తీరు సైతం ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతీ రోజూ 2 లీటర్ల నీరు తాగడం వల్ల ఉన్న మరో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే.. చాలామంది కోరుకునే యవ్వన ఛాయలు కోల్పోకుండా చర్మ సౌందర్యం బాగుంటుంది. దీనికి కారణం శరీరం డీహైడ్రేషన్ బారినపడినప్పుడే చర్మంపై ముడతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చర్మం పొరల్లో మలినాలు పేరుకుపోయి కొత్త కణాలు రాకుండా ఉత్పత్తిని ఆపేస్తాయి. ఫలితంగా చర్మం సహజ కాంతిని కోల్పోయి వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలా కాకుండా నీరు సమృద్ధిగా తీసుకున్నప్పుడు శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుంది. అందుకే వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
రోజూ 2 లీటర్లకు తగ్గకుండా నీరు తీసుకునే వారు ఆకలిని తగ్గించి రోజంతా కడుపు నిండుగానే ఉన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. తద్వారా అధికంగా తినే అలవాటుకు దూరంగా ఉంటారు. ఫలితంగా వారు అధిక బరువు బారిన పడే ప్రమాదం కూడా ఉండదు. అంటే అధిక బరువును తగ్గించుకోవాలని శ్రమ పడే వారికి ఈ అలవాటు మంచిదన్నమాట. అందుకే అతిగా తినే అలవాటు ఉన్న వారు ఆ అలవాటు నుండి బయటపడటానికి భోజనం చేయడానికి ముందుగా ఒక గ్లాసు నీరు తాగితే ఫలితం ఉంటుంది అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.