వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సవాలు విసిరారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడ ఆటోనగర్‌లో జరిగిన టీడీపీ కార్యాలయ శంకుస్థాపన భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై కేసులు పెట్టుకుని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ కార్యకర్తలను చంపేశారని, పరిటాల రవిని టీడీపీ ఆఫీసులోనే చంపేశారని లోకేశ్ అన్నారు.
టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారన్నారు. తనపై, తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్, పవన్‌లు దమ్ము, ధైర్యం ఉంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు.
లక్ష కోట్లు దోచుకొని జైలుకెళ్లిన జగన్ తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సాయం చేసే అలవాటు లేని జగన్, పవన్.. చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుఫాను బాధితులను పరామర్శించే నైతిక బాధ్యత జగన్‌కు లేదా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.