శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్తిర తిరునాళ్లు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆ ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధి వరకూ 144 సెక్షనును అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపటి నుండి రెండు రోజుల పాటు అయ్యప్ప దేవాలయం తెరుచుకోనుంది కాబట్టి.. ఇప్పటికే నిఘా వ్యవస్థను.. భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని పోలీసులకు తెలియజేయడం జరిగింది. రేపు సాయంత్రం నుండి ఆలయం వద్ద భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున.. ఇప్పటికే అదనపు బలగాలను శబరిమలైకి పంపించారు.
శబరిమలైతో పాటు పంబ, ఇలౌంగల్ ప్రాంతాల్లో కూడా పోలీసులను భారీగా మోహరిస్తున్నారు. దాదాపు ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాలు అన్నింటినీ పోలీసులు తమ పర్యవేక్షణలోకి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సీసీ టీవీ కెమెరాలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టు ప్రక్కల కూడా ఇప్పటికే పలు అనుమానాలున్న చోట్ల సోదాలు నిర్వహించారు.
అయితే 10 నుండి 50 ఏళ్ల లోపు మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టకూడదని ఇప్పటికే వివిధ సంఘాలు హెచ్చరించడంతో.. పోలీసులు శాంతి భద్రతల లోపం తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే పలు బీజేపీ నేతలు కూడా ప్రపంచంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃరాలోచించాలని కోరారు. కోర్టు భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకు స్వేచ్ఛా హక్కు ఉంది అని ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు యావత్ దేశంలోని హిందువులు, అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉందని పలువురు కోరుతున్నారు.