తెలంగాణ మొదటి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ను ఈ రోజు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబరు 19వ తేది వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదిగా 19 నవంబరును పేర్కొన్నారు. నవంబరు 20వ తేదిన నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. ఈ నోటిఫికేషన్ గెజిట్ను జిల్లా కేంద్రాలు అన్నింటిలోనూ విడుదల చేశారు. డిసెంబరు 7, 2018 తేదిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే.
డిసెంబరు 11వ తేదిన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు గతంలో ప్రకటించగా.. ఎట్టకేలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి బాగా వేడెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ తరఫున 107 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసింది. మహాకూటమి నుండి అయితే సీట్ల పంపకం ఇంకా జరగలేదు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఇవే
*నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అభ్యర్థి రూ.10 వేలు నామినేషన్ రుసుము చెల్లించాలి.
*నామినేషన్ డిపాజిట్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు కాగా.. వారు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.
*అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పేపర్లలో పేర్కొనాల్సి ఉంటుంది.
*గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా పోటీ చేసేవారు, ఫారం-ఎ, ఫారం-బి పత్రాలను సమర్పించాలి.
*స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసేవారు నామినేషన్ పేపరులోని ఫారం-2, బి పార్ట్ 3లోని 'సి' కాలమ్లో పొందుపరిచిన గుర్తుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
*గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థికి ఎవరైనా ఒక ఓటరు పేరును ప్రతిపాదిస్తే సరిపోతుంది. కానీ.. స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు పేరు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
*నామినేషన్ వేసే అభ్యర్థి.. నామినేషన్ వేయడానికి 48 గంటల ముందు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు నుండి బ్యాంకు ఖాతా తెరచి.. ఎన్నికల వ్యయానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ ఖాతా ద్వారానే జరిగేలా చూడాలి.