లక్నో: వచ్చే ఏడాది జనవరిలో ఉత్తర్ ప్రదేశ్ లో జరగనున్న కుంభమేళా కోసం అలహాబాద్ జిల్లాలోని వివిధ స్టేషన్ల నుంచి మొత్తం 800 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. దేశం నలుమూలల నుంచి కుంభమేళాకు హాజరయ్యే భక్తుల సంఖ్య లక్షల్లో ఉండనుండటంతో నిత్యం నడిచే సర్వీసులతోపాటు అదనంగా 800 రైళ్లు నడిపేందుకు ఇండియన్ రైల్వే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ అదనపు రైళ్లను ఉత్తర మధ్య రైల్వే (NCR) నడపనున్నట్టు సమాచారం. వారణాసిలో జరగనున్న ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకల కోసం భారత్‌కి రానున్న 5000 మంది వేడుకల అనంతరం అలహాబాద్‌లో ఉంటారని, అక్కడి నుంచే వారంతా కుంభమేళా ఉత్సవాలకు హాజరవుతారని ఉత్తర మధ్య రైల్వే జోన్ పీఆర్వో అమిత్ మాల్వియా తెలిపారు. కుంభమేళా అనంతరం 5 ప్రత్యేక రైళ్ల ద్వారా ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్స వేడుకల కోసం అదే ప్రవాస భారతీయులను అలహాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నట్టు మాల్వియా చెప్పారు.
ఇదిలావుంటే, కుంభమేళా ప్రత్యేకతను యావత్ దేశానికి చాటిచెప్పే విధంగా ఉత్తర మధ్య రైల్వే జోన్ నుంచి ప్రారంభమయ్యే అన్ని ప్రత్యేక రైళ్లకు చెందిన 1400 కోచ్‌లపై వినైల్ ప్రింటింగ్‌తో ప్రకటనలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
కుంభమేళా కోసం 800 అదనపు రైళ్లు