మహా శివరాత్రి ప్రత్యేకతలు ఏంటి, ఆరోజు శివుడిని ఎందుకు ఆరాధిస్తారు ?

మహా శివరాత్రి ప్రత్యేకతలు ఏంటి, ఆ రోజే శివుడిని ఎందుకు ఆరాధిస్తారు ?

Last Updated : Mar 3, 2019, 11:08 PM IST
మహా శివరాత్రి ప్రత్యేకతలు ఏంటి, ఆరోజు శివుడిని ఎందుకు ఆరాధిస్తారు ?

ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రినే అని పురాణాలు చెబుతున్నాయి. మహాశివుడు, పార్వతిల వివాహం జరిగిన రోజునే మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటుండగా మహా శివరాత్రికి ఇంకెన్నో ప్రాధాన్యత, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టంచేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు కూడా మహా శివరాత్రినే అని చెబుతుంటారు. మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని, పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివ భక్తుల బలమైన విశ్వాసం. 
 
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వున్న శివాలయాలు మహా శివరాత్రి రోజున కిక్కిరిసిపోతుంటాయి. అందులోనూ ఈ ఏడాది మహాశివరాత్రి ఆ శివుడికి ఇష్టమైన సోమవారం రోజున రావడం ఈ మహా శివరాత్రికి మరింత ప్రత్యేకతను చేకూర్చినట్టయింది. అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలను వేడుకగా  నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న అర్థ కుంభమేళా సైతం ఈ మహా శివరాత్రి రోజునే ముగియనుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోన్న అర్థ కుంభమేళాలో పాల్గొని మహాశివరాత్రి రోజున పవిత్ర స్నానం ఆచరించాలనుకునే వారికి ఇది మరో గొప్ప అవకాశం కానుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడం, అందులోనూ మహా శివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించడాన్ని శివ భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. 

మహాశివరాత్రి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పఠించే ఒక్కో మంత్రం వెనుక ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నెన్నో విశిష్టతలు దాగి వున్నాయి. మనసులోని భయాందోళనలను దూరం చేయడానికి ఓం నమశివాయః అని, పరమశివుడి ఆశీర్వాదాల కోసం ఓం నమో భగవతే రుద్రాయః అని, భక్తులకు శివుడు దీర్ఘాయుష్షు ప్రసాదించడం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. 

పండగ ఏదైనా ఫలాలు లేనిదే అది పూర్తి కాదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే, మహా శివరాత్రి రోజున శివుడికి ఫలాలను ప్రసాదంగా సమర్పించుకున్న అనంతరం ఉపవాస దీక్షలు చేసే భక్తులు ఆ రోజంతా ఫలాలు మాత్రమే స్వీకరిస్తారు. ముఖ్యంగా ఆకలిని ఓర్చుకోలేని వారు ఉపవాసం చేసే సమయంలో డ్రైఫ్రూట్స్ తీసుకున్నట్టయితే, ఆకలిని తట్టుకునే శక్తి లభిస్తుంది. 

Trending News