అమృత్సర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో వున్న స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టేన్ అమరిందర్ సింగ్ కూడా రాహుల్ గాంధీతో కలిసి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి కాగా మే 12న పంజాబ్‌లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సిక్కులు పవిత్రంగా భావించే ఈ స్వర్ణ మందిర్‌లో నేడు దర్శనం చేసుకుని శుక్రవారం రాత్రికి అమృత్‌సర్‌లోనే బస చేయనున్న రాహుల్ గాంధీ శనివారం ఉదయం జలియన్‌వాలా బాగ్ ఘటనలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు నివాళి అర్పించనున్నారు.
జలియన్‌వాలా బాగ్ ఊచకోత ఘటనకు ఏప్రిల్ 13తో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా శనివారం అమృత్సర్ రానున్నారు.