భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టకాలం వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి బీజేపి వర్గాలు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో వుందని.. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపి డిమాండ్ చేస్తోంది. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌కి ఓ లేఖ రాసిన బీజేపి నేతలు.. రాష్ట్రంలో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌కి కాలం చెల్లిందని, రాష్ట్రంలో వున్న అనేక అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నందున వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా తమ లేఖలో విజ్ఞప్తి చేశారు.
మే19న చివరి విడత ఎన్నికలు ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపి, ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉండటంతోపాటు మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలోనే బీజేపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.