దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అక్టోబర్ 24వ తేదీ గురువారానికి ఈ అల్పపీడనం మరింత బలపడి ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, ఫలితంగా కోస్తా జిల్లాల్లో అతి తీవ్ర, అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు అక్కడక్కడ పిడుగులు కూడా పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో తీరం వెంట గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. జాలర్లు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
అతి భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు: వాతావరణ శాఖ హెచ్చరిక