హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. శీతాకాల విడిది నిమిత్తం సతీ సమేతంగా హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పుష్పగుచ్చాలతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన షెడ్యూల్ వివరాలు..
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఇక్కడి నుంచే దక్షిణాదిన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 23-26 మధ్య చెన్నై, పుదుచ్చెరి, తిరువనంతపురంలో పర్యటించనున్న రాష్ట్రపతి... ఆ తర్వాత డిసెంబర్ 28 వరకు హైదరాబాద్లోనే బస చేయనున్నారు. అనంతరం డిసెంబర్ 28న మధ్యాహ్నం 3.15 గంటలకు ఇదే హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.