Congress Party: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈసారి సిట్టింగ్ సీటును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు సమీక్ష నిర్వహించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా హాజరయ్యారు. ఆమెతో పలువురు మంత్రులు.. నాలుగు జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరునే నేతలు దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. దాంతో ఎలాగైనా ఈసారి సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగానే జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.. ఇప్పుడు సొంత పార్టీనే అధికారంలో ఉండటంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్నికల వ్యూహాంపై చర్చించిన పార్టీ పెద్దలు.. జిల్లాకు ఓ ఇంచార్జ్‌ను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు చాలామంది లీడర్లు పోటీపడ్డారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేత వెలిచాల రాజేశ్వర్ రావు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పార్టీలో ఓ వర్గం కూడా ఆయనకు సీటు ఇస్తే ఓకే చెప్పినట్టు ప్రచారం జరిగింది. అలాగే మరికొందరు లీడర్ల పేరు తెరమీదకు వచ్చినా చివరకు పార్టీ పెద్దలు మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తాజా భేటీలోనూ నేతలంతా జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదించి తీర్మానం చేసినట్టు సమాచారం. అయితే అభ్యర్ధి ఎంపిక విషయాన్ని మాత్రం పార్టీ హైకమాండ్‌కే వదలివేసినట్టు తెలిసింది.
ఇదిలా ఉంటే గాంధీభవన్‌లో మాత్రం జీవన్ రెడ్డి పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అధికార పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన రగిలిపోతున్నారు. పార్టీలో సంజయ్ అయినా ఉండాలి.. లేదంటే నేనైనా పార్టీని వీడుతానంటూ హెచ్చరించారు. ఈ గొడవ కాస్తా ఢిల్లీవరకు చేరడంతో పార్టీ పెద్దలు సర్ధిచెప్పడంతో సైలెంట్ అయ్యారు. కానీ జీవన్ రెడ్డిలో మాత్రం అసంతృప్తి చల్లరలేదని ఆయన మాటల్లోనే స్పష్టం అవుతోంది. కానీ ఇప్పుడు పార్టీ పెద్దలే జీవన్ రెడ్డి పేరును హైకమాండ్‌కు తీర్మానం చేసి పంపడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలు ఆయనకు సహకరిస్తారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి..
మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలో దిగితే మాత్రం.. అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా బలమైన అభ్యర్ధులనే రంగంలోకి దింపుతారనే చర్చ సైతం జరుగుతోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరు అవుతారో.. అధికార పార్టీ సిట్టింగ్ సీటుకు కాపాడుకుంటుందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.!
Also Read: Warangal Politics: ఆరూరి అలక.. కేసీఆర్ మెలిక!
Also Read: Konda Surekha: పులి దాడిలో మహిళా మృతి.. భారీగా నష్టపరిహారం అందజేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter