హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు సహా బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
1965లో మండి జిల్లాలోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన జైరామ్ ఠాకూర్.. పేదరికాన్ని అధిగమించి బాల్యం నుంచి మెరిట్ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.చండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న ఠాకూర్ విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి దగ్గరయ్యారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన బీజేపీ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో సెరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత చెత్ రామ్‌పై విజయం సాధించారు. జైరామ్ ఠాకూర్‌తోపాటు 11 మంది కేబినెట్ మంత్రులు ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంకన్నా ముందుగా వేదిక వద్దకు వెళ్లే క్రమంలో మీడియాతో మాట్లాడిన జైరామ్ ఠాకూర్... రాష్ట్ర ప్రజలు తమని గెలిపించినందుకు వారికి రుణపడి వుంటాం అని అన్నారు. అదే సమయంలో ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటామని ఠాకూర్ స్పష్టంచేశారు.
జైరామ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరైన నేపథ్యంలో రిడ్జ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1,000 మంది వరకు భద్రతా బలగాలని రంగంలోకి దింపారు. మరోవైపు ఇంటెలీజెన్స్ వింగ్ అధికారులు మఫ్టీలో విధులకి హాజరు కాగా అక్కడక్కడా మొహరించిన షార్ప్ షూటర్స్.. అనుమానితుల కదలికలపై నిశితంగా దృష్టిసారించారు.