ప్రకాశం జిల్లాలోని కంచర్ల గుట్ట ప్రాంతంలో దళిత వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే ఆ ప్రాంతంలో నివసిస్తున్న కమ్మ కులస్థులు ఊరి నడిబొడ్డున చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో దేవత చాలా మహిమగలదని.. ఎలాంటి చెడుశక్తులను ఊరిలోకి రాకుండా చేస్తుందని ప్రచారం చేశారు. ఈ క్రమంలో అదే గ్రామంలో నివసిస్తున్న మాదిగలు ఆ ఆలయం వైపు వెళ్లకుండా చూడాలని కూడా ఆజ్ఞలు జారీచేశారు. మాదిగలు ఆ ఆలయం వైపు వెళ్తే ఆలయ పవిత్రత దెబ్బతింటుందని.. అందుకే వారికోసం వేరే రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలో వారి మాటలు వినిపించుకోకుండా వెళ్లిన వారిపై కోపోద్రిక్తులైన పెద్దలు.. ఆయా కుటుంబాలను ఊరి నుండి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. వారికి పొలాల్లో పనులు ఇవ్వవద్దని.. వారి ఇంటికి ఎవర్నీ వెళ్లవద్దని.. మళ్లీ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే 10,000 జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తాము ఆ ఆలయ మార్గం ద్వారా వెళ్లేటప్పుడు ఎలాంటి వాహనాలను ఉపయోగించవద్దని మాత్రమే మాదిగ వర్గాలకు తెలిపామని ఆ తర్వాత ఊరిపెద్దలు చెప్పినట్లు సమాచారం. ఇదే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి.
ఊరి మధ్యలో ఉన్న రోడ్డు మార్గాన్ని కొందరికే పరిమితం చేయడం వల్ల దళితులు వేరే మార్గాన్ని ఎంచుకొని ఊరు దాటడం కష్టంగా మారిందని.. వేరే కులస్థులు మాత్రం ప్రధాన మార్గం ద్వారానే హాయిగా పనులకు వెళ్తున్నారని అదే ఊరికి చెందిన కొందరు వ్యక్తులు తెలిపారు. గతంలో తమ ప్రాంతంలో కుల వివక్ష ఎక్కువగా ఉండేదని.. ఈ మధ్యకాలంలో తగ్గిందని.. అయితే అప్పుడప్పుడు ఇలాంటి కట్టుబాట్లను ఊరి పెద్దలు పెట్టడం వల్ల మాదిగలకు సమస్యలు ఎదురవుతన్నాయని కొందరు తెలిపారు. ఆ ఊరిలో ఆలయం కట్టడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్నది కూడా కొందరి అభిప్రాయం. ఇటీవలే కొందరు ఈ గ్రామ సమస్యను ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ వద్దకు తీసుకెళ్లడంతో ఆయన గ్రామస్థుల మధ్య సయోధ్యను కుదిర్చారని కూడా వార్తలు వస్తున్నాయి.