మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ లో రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ఆరోసారి టైటిల్ ను సాధించి మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెదరర్ 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో మారిన్ సిలీచ్ పై విజయం సాదించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఫెదరర్ ఆది నుంచి ఆటలో దూకుడుగా ఆడినా.. రెండు, నాలుగో సెట్లలో మారిన్ పై చేయి సాధించాడు. చివరిదైన ఐదో సెట్లో ఫెదరర్ సత్తాచాటి విజయకేతనం ఎగురవేశాడు. మూడు గంటల ఐదు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ ఆటలో చివరకు ఫెదదర్ కే విజయం వరించింది.
ఇక ఇప్పటివరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ టైటిల్ లను గెలుచుకున్న రాయ్ ఎమర్సన్, నొవాక్ జొకోవిచ్ ల సరసన ఫెదరర్ నిలిచాడు. కెరీర్లో ఫెదరర్ కిది 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారుడిగా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ఫెదరర్ 30 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ కు చేరడం విశేషం.