Legislature vs Judiciary: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీ చర్చకు సిద్ధమౌతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశమే ప్రధానంగా ఉండనుందని..శాసనసభ వర్సెస్ న్యాయ వ్యవస్థపై సమీక్షకు నాంది పలకనుందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి చాలా కీలకంగా మారనున్నాయి. ఈసారి జరగబోయేవి బడ్జెట్ సమావేశాలనే కంటే..గత కొద్దికాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభనపై సమీక్ష అనడం సమంజసమనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే రెండు సమాంతర వ్యవస్థలు..ఒకటి శాసనాలు చేసేది, రెండవది చట్టాన్ని అమలు చేసేది. ఈ రెండింటిలో అంటే శాసనసభ వర్సెస్ న్యాయవ్యవస్థలో ఎవరు గొప్ప..ఎవరిది పైచేయి, ఎవరి అధికారాలేంటనే విషయంపై ఇప్పటి నుంచి కాదు..చాలా కాలం నుంచి సందేహాలు వస్తూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని న్యాయ వ్యవస్థ కాదన్నప్పుడు, న్యాయవ్యవస్థ అధికారాలు, శాసనసభ అధికారాలపై వాదన వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి చర్చనీయాంశం కానుంది.
ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. ఎందుకంటే అమరావతి ఒక్కటే కాదు, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక వివిధ సందర్భాల్లో వివిధ నిర్ణయాలపై న్యాయ వ్యవస్థ నుంచి ప్రతిరోధకాలు ఎదురవుతూ వస్తున్నాయి. న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు నిలిచిపోయాయనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గతంలోనే చాలాసార్లు శాసనసభ, న్యాయవ్యవస్థ అధికారాలపై చర్చ జరగాలని బాహాటంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరావతి హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఈసారి తప్పనిసరి అని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
అసెంబ్లీ 25 వరకు..అదే కారణం
ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 25వ తేదీ వరకూ నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా బహుశా ఇదేననేది సమాచారం. అమరావతి హైకోర్టు తీర్పు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాధినేతలు గట్టిగానే స్వరం విన్పించారు. చట్టాలు చేసే, నిర్ణయాలు తీసుకునే అధికారం అసెంబ్లీకు లేదంటే ఎలా కుదురుతుందని ధర్మాన వంటి నేతలు ప్రశ్నించారు. శాసనవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుందని రాజ్యాంగ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుడజు విధానాల్ని సమీక్షించే, రద్దు చేసే అధికారం తప్పకుండా ప్రజలెన్నుకున్న శాసనసభ్యులకు ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని లక్ష్యాల్ని సాధించేందుకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు అధికారాల్ని విభజించేటప్పుడు రాజ్యాంగం పూర్తిగా బ్యాలెన్స్ పాటించిందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
చట్టాలు చేసే అధికారం ఎవరిది
రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో ఉన్న పలు అంశాలపై చట్టం చేసే అధికారం ఎప్పుడూ శాసన వ్యవస్థకే ఉంటుందనేది రాజ్యాంగ నిపుణులు చెబుతున్న విషయంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం చెప్పేది కూడా అదేనంటున్నారు. చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేనప్పుడు..అసెంబ్లీ ఎందుకని ప్రశ్నించారు. అందుకే అధికారాల విభజన సిద్ధాతంపై చర్చించేందుకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాల్ని నిర్వహించాలని కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రికి ధర్మాన లేఖ కూడా రాశారు. రాజ్యాంగం, శాసన, కార్య నిర్వాహ, న్యాయ వ్యవస్థల మధ్య విభజించిన అధికారాలపై చర్చ అవసరమని కోరారు.
బీఏసీలో ప్రతిపాదన
బీఏసీ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అంశంపై చర్చించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో గత కొద్దికాలంగా నెలకొన్న శాసనసభ వర్సెస్ న్యాయవ్యవస్థపై చర్చ ద్వారా..ప్రజలకు అవగాహన కల్పించాలనేది అధికార పార్టీ వ్యూహం. ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రజలకు చెప్పాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి హైకోర్టు తీర్పుపై ప్రత్యేక చర్చ చేయనున్నారు. సమావేశాల్ని వారం రోజులకు కాకుండా..25వ తేదీవరకూ నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ప్రదాన కారణం ఇదేనని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook