Tamilnadu: తమిళనాడులో ఘోర విషాదం... రథోత్సవంలో విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి...

Tamilnadu Tanjavur 11 Died in Chariot Festival: రథోత్సవం సందర్భంగా విద్యుత్ షాక్ కారణంగా 11 మంది భక్తులు మృతి చెందిన ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటు చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 12:37 PM IST
  • తమిళనాడు తంజావూరులో విషాదం
  • స్తానిక ఆలయంలో రథోత్సవం సందర్భంగా విద్యుత్ షాక్
  • ప్రమాద ఘటనలో 11 మంది మృతి
Tamilnadu: తమిళనాడులో ఘోర విషాదం... రథోత్సవంలో విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి...

Tamilnadu Tanjavur 11 Died in Chariot Festival: తమిళనాడులోని తంజావూరులో విషాదం చోటు చేసుకుంది. కలిమేడులోని అప్పర్ స్వామి మఠంలో రథోత్సవం సందర్భంగా విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 27) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రథోత్సవం ముగించుకుని రథాన్ని తిరిగి ఆలయానికి తీసుకొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతులను మోహన్ (22), ప్రతాప్ (36), రాఘవన్ (24), తండ్రి అన్పళగన్ (60), నాగరాజ్ (60), సంతోష్ (15), సెల్వం (56), రాజ్‌కుమార్ (14), స్వామినాథన్ (56), గోవిందరాజ్ (45) మరియు పరనిధరన్ (13)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 

రథోత్సవ ఊరేగింపులో విద్యుత్ దీపాలతో అలంకరించిన తొమ్మిది అడుగుల ఎత్తయిన రథం విద్యుత్ వైర్‌ను తాకడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. రథం విద్యుత్ వైర్‌ను తాగడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీన్ని అగ్నిప్రమాదంగా భావించి మంటలు ఆర్పేందుకు కొంతమంది నీళ్లు చల్లారు. దీంతో నీళ్లు పోసినవారికి కూడా ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఒకవేళ వారు నీళ్లు చల్లకపోయి ఉంటే మృతుల సంఖ్య తక్కువగానే ఉండేదని స్థానిక అధికారులు తెలిపారు.

ప్రతీ ఏటా రథోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఈసారి విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని సెంట్రల్ జోన్ ఐజీ బాలకృష్ణన్ తెలిపారు. 

సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి :

విద్యుత్ షాక్ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఇవాళ స్టాలిన్ పరామర్శించే అవకాశం ఉంది. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా స్టాలిన్ అధికారులను ఆదేశించారు.

Also Read : Beer Prices: బీర్ బాబులకు బ్యాడ్‌న్యూస్, పెరగనున్న బీరు ధరలు, ఒక్కొక్క బీర్ ఎంతంటే

Also Read: RR vs RCB: కోహ్లీ మరోసారి విఫలం, రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News