జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని తాంగ్దార్ సెక్టార్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలో ప్రవేశించే ప్రయత్నం చేశారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. ఎంతమంది ఉగ్రవాదులు సరిహద్దు దాటటానికి ప్రయత్నిస్తున్నారో స్పష్టంగా తెలియకపోయినా.. స్థానిక నివేదికలు మాత్రం ఐదుగురు తీవ్రవాదులు చంపబడ్డారని ధృవీకరించాయి.
దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ చర్యలను తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. కూబింగ్ ఇంకా కొనసాగుతోంది.
పాకిస్థాన్లోని జైళ్లలో ఉన్న ఖైదీలను ఐఎస్ఐ శిక్షణ ఇచ్చి భారతదేశంపై ఉసిగోల్పుతోందని నివేదికలు తెలిపాయి. భారత సైన్యం, వారి శిబిరాలపై స్థానిక దాడులను ప్రయోగించాలని ఐఎస్ఐ శిక్షణ ఇస్తోందని ఆ నివేదికలు వెల్లడించాయి. దీనికి బదులుగా వారికి జైలు శిక్షలు తగ్గించడం (లేదా) డబ్బు ఇవ్వడం వంటి వాగ్దానాలు చేస్తున్నాయని తెలిపాయి.
ఈ నేపథ్యంలో మరింత మంది ఉగ్రవాదులు చొచ్చుకొచ్చి ఉంటారన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెర్రరిస్టులు జవాన్లపై కాల్పులు జరపడంతో.. సైన్యం కూడా ప్రతి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.