Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచినప్పటికీ.. బేసిక్ శాలరీ పెరగాలని డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎందుకంటే బేసిక్ శాలరీ ఆధారంగానే వారి జీతం పెరుగుతుంది కనుక బేసిక్ శాలరీ పెంచితేనే తమకు భవిష్యత్తులో జీతం పెంపు లబ్ధి చేకూరుతుందనేది వారి వాదన.
మార్చి 2023లో ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్సుని కేంద్రం పెంచే అవకాశం ఉందని.. ఈ పెంపు జనవరి 1 నుంచే వర్తిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానుండగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2023 బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతానికి సాధారణ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లుగా ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 కి పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పెంపు అనంతరం ఉదాహరణకు రూ.18,000 వేతనం ఉన్న వారికి రూ.26,000 కు పెరుగుతుంది.
7వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్..
ఒకవేళ ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచినట్టయితే, అలవెన్సులు కాకుండానే ఉద్యోగుల జీతం 18,000 X 2.57 = రూ. 46,260 కు పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం తెలిపినట్లయితే.. వారి జీతం 26000 X 3.68 = రూ. 95,680 కు పెరుగుతుంది. ప్రభుత్వం ఒకవేళ 3 రెట్లు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వారి జీతం 21000 X 3 = రూ. 63,000 లకు పెరుగుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అది గుడ్ న్యూస్ కాక మరేమవుతుంది చెప్పండి.