పాకిస్థాన్‌‌లో జంట పేలుళ్లు..133 మంది మృతి

శుక్రవారం పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.

Last Updated : Jul 14, 2018, 03:29 PM IST
పాకిస్థాన్‌‌లో జంట పేలుళ్లు..133 మంది మృతి

శుక్రవారం పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో జాతీయ నాయకుడితో సహా కనీసం 133 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.  జూలై 25న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పాకిస్థాన్‌లో ఎన్నికల ముందు జంట పేలుళ్లు చోటుచేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి, ప్రపంచ నాయకులు స్పందించారు. పాకిస్థాన్‌లో రాజకీయ అభ్యర్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు.

పాక్‌లో ఈ నెల 25న ఎన్నికల నేపథ్యంలో బలూచిస్థాన్‌ అవామీ పార్టీ (బీఏపీ) మస్తంగ్‌లో ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బీఏపీ అభ్యర్థి సిరాజ్‌ రైసానీ వాహనం సమీపంలో వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో బీఏపీ అభ్యర్థి సిరాజ్‌ రైసానీ సహా.. 128 మంది మృతి చెందగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించుకుంది.

‘ఉగ్రవాదులు శక్తిమంతమైన పేలుడు పదార్థాలను వినియోగించారు. ఈ స్థాయిలో విధ్వంసం జరగడానికి 16-20 కేజీల పేలుడు పదార్థాలు అవసరం. సిరాజ్‌ లక్ష్యంగా మానవ బాంబు దాడి జరిగిందని తెలిసింది. పేలుడుకు వినియోగించిన మెకానిజాన్ని గుర్తించాల్సి ఉంది’ అని బాంబ్‌ స్క్వాడ్‌ అధికారులు తెలిపారు.
 

మరో ఘటనలో ఐదుగురు..

బలూచిస్థాన్‌ ఘటనకు ముందు ఖైబర్‌ పఖ్తూంఖ్వా రాష్ట్రంలోని బన్నూలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఎంఎంఏ పార్టీ అభ్యర్థి అక్రమ్‌ ఖాన్‌ దుర్రానీని లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల ప్రచారంపై బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 37 మంది గాయాలపాలయ్యారు.

 

Trending News