మళయాళ సూపర్ స్టార్, ఏఎంఎంఏ అధ్యక్షుడు మొహాలీ లాల్‌కు చుక్కెదురైంది. ఈ నెల 25న కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండగా కొందరు దర్శకులు, నటీ నటులు వేడుక పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ముందుగా ఈ అవార్డు వేడుకలకు ముఖ్య అతిథిగా నటుడు మోహన్ లాల్‌ను ఆహ్వానించాలని, ఆయన చేతుల మీదుగా విజేతలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు డా. బిజూకుమార్ దామోదరన్ మాత్రం అవార్డు వేడుకలకు మోహన్ లాల్ చీఫ్ గెస్ట్‌గా రావడం, ఇతర నటులకు అవార్డులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. రాష్ట్రపతి అవార్డ్స్ వేడుక ఎలాగైతే రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుందో అలాగే స్టేట్ అవార్డ్స్ ముఖ్యమంత్రి అందజేయాలని సూచించారు.
మోహన్ లాల్ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా వస్తే తాను వేడుకలకు రానని తేల్చిచెప్పారు. ఆయనకు మద్దతుగా ప్రకాష్ రాజ్, సచిదానందన్‌లతో సహా మొత్తం 100 మందిపైగా ఇతర సినీ ప్రముఖులు వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఓ నటి విషయంలో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన నటుడు దిలీప్‌ను మళ్ళీ చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించి, సభ్యత్వాన్ని మోహన్ లాల్ పునరుద్ధరించారు. దీనిపై గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది.