బ్రిటన్‌ చెస్ భవిష్యత్తుకు ఆ బాలుడు అవసరం.. అందుకే ఇండియా పంపించవద్దు..!

బ్రిటన్ దేశం తరఫున చదరంగం ఆటకు ప్రాతినిధ్యం వహించి ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించిన తొమ్మిదేళ్ల బాలుడు శ్రేయస్ రాయల్ ఇప్పుడు అక్కడ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

Last Updated : Aug 5, 2018, 01:54 PM IST
బ్రిటన్‌ చెస్ భవిష్యత్తుకు ఆ బాలుడు అవసరం.. అందుకే ఇండియా పంపించవద్దు..!

బ్రిటన్ దేశం తరఫున చదరంగం ఆటకు ప్రాతినిధ్యం వహించి ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించిన తొమ్మిదేళ్ల బాలుడు శ్రేయస్ రాయల్ ఇప్పుడు అక్కడ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అందుకు కూడా ఓ బలమైన కారణం ఉంది. శ్రేయస్ తల్లిదండ్రులు 2012లో ఉద్యోగ రీత్యా బ్రిటన్‌కు వచ్చారు. ఆ తర్వాత అక్కడే పెరిగిన వారి కుమారుడు శ్రేయస్ చిన్నప్పటి నుండీ చదరంగం క్రీడలో ఆరితేరాడు. పలుమార్లు దేశం తరఫున పాల్గొని జూనియర్ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు.

అయితే తాజాగా శ్రేయస్ తల్లిదండ్రుల వీసా గడువు ముగియడంతో వారు భారత్ తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్రిటన్ దేశానికి ఎంతో పేరు తీసుకొని వచ్చిన శ్రేయస్.. ఆ దేశ భవిష్యత్తు అని.. అతన్ని ఇండియా పంపించవద్దని ఆ కుర్రాడికి శిక్షణ ఇచ్చిన మాస్టర్లతో పాటు ఆ బాలుడి అభిమానులు కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఆఖరికి ఈ విషయం ఎంత వరకు వెళ్లిందంటే.. బ్రిటన్ ఎంపీలు సైతం అక్కడి పార్లమెంటులో  ఈ బాలుడి తరఫున పోరాడడానికి సిద్ధమయ్యారు.

బ్రిటన్ దేశానికి ఎంతో పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చిన శ్రేయస్‌కు, ఆయన కుటుంబానికి తగిన అవకాశం కల్పించి బ్రిటన్‌లోనే ఉండేలా ప్రభుత్వం ఆలోచించాలని అనేకమంది విన్నవించుకున్నారు. శ్రేయస్‌కు పూర్తి స్థాయి బ్రిటన్ పౌరసత్వం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. ప్రభుత్వ నిబంధలనకు తలొగ్గే తాము నడుచుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే ఆ దేశ హోంశాఖ తెలిపింది.

ఈ అంశంపై ఎంపీ రాచెల్ రీవ్స్ మాట్లాడుతూ "శ్రేయస్ తండ్రి దాదాపు 1,20,000 పౌండ్ల వార్షిక వేతనం లభిస్తేనే ఆ దేశంలో ఉండి వీలుందని.. లేకపోతే వారి కుటుంబం ఇండియా వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని" తెలిపారు. అయితే ఆ నిర్ణయం కూడా శ్రేయస్ తండ్రి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుందని.. అయితే అది ప్రైవేటు విషయం కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోదని హోంశాఖ తెలిపింది. అయితే.. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించకపోతే.. బ్రిటన్ గొప్ప చదరంగ ప్రతిభ కలిగిన బాలుడిని కోల్పోతుందని పలువురు విచారం వ్యక్తం చేశారు. 

Trending News