15 ఏళ్లకే డిగ్రీ చేసిన చిచ్చర పిడుగు

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన తనిష్క్ అబ్రహాం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేరి 15 ఏళ్లకే డిగ్రీ అందుకున్నాడు.

Updated: Jul 29, 2018, 10:12 PM IST
15 ఏళ్లకే డిగ్రీ చేసిన చిచ్చర పిడుగు
Image Credit: Facebook/Tanisq Abraham

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన తనిష్క్ అబ్రహాం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేరి 15 ఏళ్లకే డిగ్రీ అందుకున్నాడు. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్న ఈ బాలుడు 11 ఏళ్లప్పుడే ఆ కోర్సులో చేరాడు. చిత్రమేంటంటే.. ఫాదర్స్ డే నాడు ఈ ఘనత సాధించిన ఈ బాలుడు.. ఆ డిగ్రీని తన తండ్రికి అంకితమిస్తున్నానని తెలిపాడు.

తనిష్క్  అమ్మమ్మ, తాతయ్యలు ఇద్దరూ కూడా డాక్టర్లే. అయిదు సంవత్సరాల వయసులోనే కమ్యూనిటి కాలేజీలో చేరిన తనిష్క్.. ఆ వయసులోనే కాలేజీ విద్యార్థులకు సైతం ఎంతో కష్టమైన మ్యాథ్స్ కోర్సులను పూర్తి చేశాడు. ఆరు సంవత్సరాల వయసులోనే హైస్కూలు సిలబస్ చదవడం పూర్తి చేసిన తనిష్క్.. ఆ వయసులోనే రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భూగోళ శాస్త్రం మొదలైన సబ్జెక్టులకు సంబంధించిన హైస్కూలు సిలబస్ మొత్తం చదివేసి.. పరీక్షలు రాసి పాసయ్యాడు కూడా. ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి.. తనిష్క్ ఎంతో కష్టమైన ఆస్ట్రానమీ సబ్జెక్టు పరీక్షలు కూడా రాసి పాసయ్యాడు. తనీష్ పూర్వీకులు కేరళ ప్రాంతానికి చెందినవారు. 

తనిష్క్ విద్యార్థిగా ఉన్నప్పుడే పలు పరిశోధనలు కూడా చేశాడు. అగ్నిప్రమాదం బారిన పడిన గుండె జబ్బు పేషెంట్లను ముట్టుకోకుండా.. వారి హార్ట్ బీట్ కాలిక్యులేట్ చేయగలిగే యంత్రాన్ని తాను కనిపెట్టాడు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన కష్టమైన సిలబస్ అంతా కూడా విద్యార్థిగా ఉన్నప్పుడే చదవడం పూర్తిచేసిన తనిష్క్.. చికిత్స కూడా చేయగలిగే స్థాయికి చేరాడు. అయితే తనిష్క్ ఇప్పుడే బయోమెడికల్ ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసినా.. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం ఇంకా తన వయోపరిమితి పూర్తి అవ్వాల్సిందే అంటోంది ఆ కుర్రాడు చదివిన యూనివర్సిటి.