HBD PM Narendra Modi: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక రకంగా ఈ పుట్టినరోజు నరేంద్ర మోడీకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. స్వాతంత్రం వచ్చాకా ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులు ఎక్కారు. ఇంకా ఈయన ఖాతాలో మరెన్నో రికార్డులు..
HBD PM Narendra Modi: ఎక్కడో బాంబే స్టేట్ లో (ప్రస్తుత గుజరాత్) లోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబర్ 17 న హీరా బెన్, దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీలకు 6 గురు సంతానంలో నరేంద్ మోడీ 3వ సంతానంగా జన్మించాడు. ఆయన గుజరాత్ లోని వాద్ నగర్ లో టీ అమ్ముతూ జీవితం సాగిస్తున్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు కొనసాగించారు. అలా టీ అమ్ముతూ ఆర్ఎస్ఎస్ తో పరిచయం మోడీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమ్ ప్రచారక్ బాధ్యతలు నిర్వహించారు.1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో జైలు పాలయ్యారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ సమయంలో అజ్ఞాతంలో గడిపారు. ఆర్ఎస్ఎస్ ఫుల్ ప్రచారక్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే జన సంఘ్ లో చేసారు. 1980లో భారతీయ జనతా పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించారు.
అంతేకాదు రాజస్థాన్ తర్వాత గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీ రోల్ పోషించారు. 2001 యేడాదిలో గుజరాత్ లోని భుజ్ భూకంప బాధితులను ఆదుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ విఫలం కావడంతో ఆయన ప్లేస్ లో నరేంద్ర మోదీని 7 అక్టోబర్ 2001లో అప్పటి బీజేపీ హై కమాండ్ ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. శాసనసభ్యుడి కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.
2002లో గుజరాత్ లోని గోద్రాలో కర సేవలను సజీవ దహనం చేయడంతో అల్లర్లు చెలరేగాయి. నరేంద్ర మోడీకి అప్పటికే బాధ్యతలు స్వీకరించి నెలలు మాత్రమే అయ్యాయి. అప్పటికే పరిస్థితు చేయి దాటిపోయాయి.
ఆ తర్వాత మోడీ తన చాణక్యంతో గుజరాత్ లో చెలరేగిన అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వరుసగా 2002, 2007, 2012లో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు.
2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్ధిగా బరిలో దిగి వారణాసితో పాటు వడోదర నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వడోదరకు రాజీనామా చేసి వారణాసి ఎంపీగా కొనసాగారు.
2014, 2019, 2024లో వరుసగా మూడుసార్లు ప్రధాన మంత్రి ఎన్నికయ్యారు. భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుస మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులకు ఎక్కారు.
అప్పట్లో చాచా నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిగా కాకుండా.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పోతూ పోతూ ఆయన్ని నియమిస్తూ వెళ్లింది. కానీ ఆ తర్వాత ప్రజల అభిమానంతో వరుసగా 1952, 1957,1962 ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అప్పట్లో కమ్యూనిష్టులు తప్ప ఎలాంటి ప్రతిపక్షం లేకుండా వరుసగా మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
కానీ నరేంద్ర మోడీ మాత్రం బలమైన ప్రతిపక్షాలను ఢీ కొని 2014,2019,2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాన మంత్రి పీఠం అధిరోహించారు. అంతేకాదు భారత దేశ ప్రధాన మంత్రిగా రష్యా, అమెరికా, సౌదీ అరేబియా సహా ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న నేతగా రికార్డు.
మన దేశంలో నెహ్రూ, నరేంద్ర మోడీ మధ్యలో ఇందిరా గాంధీ, అటల్ బిహారి వాజ్ పేయ్ మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతులు స్వీకరించినా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నాల్గో నేతగా నిలిచారు.